-------------కాశ్మీర్ అనగానే తీవ్రవాదుల దాడులు, సైనికుల కాల్పులు, హత్యలు గుర్తుకు రావడం సహజం. కానీ ప్రకృతిపరంగా ఎంతో సుందరమైన కాశ్మీరులో చెప్పుకోదగ్గ విషయాలూ లేకపోలేదు. వాటిలో ఒకటి - రిఫాత్ మసూదీ నిర్వహించే "మసూదీ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్" అనే సంస్థ. ఈ సంస్థ తయారు చేసే క్రికెట్ బ్యాట్లు స్థానికంగానే కాకుండా ముంబై, డిల్లీ, లాహోర్ తదితర ప్రాంతాలలోనూ అమ్ముడవుతున్నాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన రిఫాత్ కాశ్మీరులోని నర్వారా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమె భర్త షౌకత్ మసూదీ ఫుట్ బాల్ కోచ్. ఆమె తండ్రి 1970లో ఆరంభించిన ఈ పరిశ్రమ కాశ్మీరులో తరచూ జరిగే అలజడులతో దెబ్బతింది. అయితే 1999లో అప్పటి భారత ప్రధాని ఎ.బి. వాజ్ పాయ్ పాకిస్తాన్ కి బస్సు దౌత్యానికి పచ్చజెండా ఊపడంతో కాశ్మీరులో మళ్ళీ పరిశ్రమల ఆశలు చిగురించాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని రిఫాత్ బ్యాట్ల తయారీకి శ్రీకారం చుట్టింది. హోల్ సేల్ వ్యాపారులను తన ఇంటికి రప్పించి తమ ఉత్పత్తుల గురించి వివరంగా చెప్పడంతో అమ్మకాలు పుంజుకున్నాయన్నారామె. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఒకింత జోరు తగ్గినా అమ్మకాలు పరవాలేదన్నారు. తన రెండతస్తుల ఇంటినే ఆమె ఉత్పత్తి కేంద్రంగా చేసుకుంది. కింది అంతస్తులో యంత్రాలను నెలకొల్పి మిగిలిన జాగాలో ముడిసరకును, తయారు చేయడానికి అవసరమైన పరికరాలను, ప్యాకింగ్ మెటీరియల్స్ ని ఉంచుకున్నారు. పది మంది సిబ్బందితో నడుస్తున్న ఈ సంస్థలో రిఫాత్ కూడా ప్రతీ పనిలోనూ పాలుపంచుకుంటోంది. ఆర్డర్లు ఎక్కువైనప్పుడు రాత్రుళ్ళూ ఆమె పని చేస్తోంది. చుట్టుపక్కలుండే మహిళలకు ఆదర్శమహిళగా ఉంటున్న రిఫాత్ తన సంస్థలో తయారయ్యే బ్యాట్లను ఏదో ఒక రోజు భారత జట్టు ఆటగాళ్ళు ఉపయోగిస్తారనే నమ్మకంలో ఉన్నారు.
కాశ్మీరులో విల్లో చెట్లను బ్యాట్ల తయారీకి వినియోగిస్తారు. కారణం అవి పటిష్టమైనవి. ఇతర మూలపదార్థాలను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుని బ్యాట్లను తయారు చేస్తున్నట్టు రిఫాత్ చెప్పారు. ఏడాదిలో కనీసం 1500 బ్యాట్లు తయారు చేస్తున్నారు.
రిఫాత్ బ్యాట్లు మాత్రమే కాక స్త్రీలను ఆకట్టుకునే రీతిలో టెన్నిస్ రాకెట్లనూ తయారు చేస్తున్నారు.
ఇలా ఉండగా, బ్యాట్లకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం....
రన్ మెషీన్ గా వినుతికెక్కి పలు రికార్డులు నమోదు చేసిన భారత బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ భారీ బ్యాట్ తో ఆడేవాడు. అతను వినియోగించిన బ్యాట్ బరువు మూడు పౌండ్ల నాలుగు ఔన్సులు.
సచిన్ టెండూల్కర్ కన్నా భారీ బ్యాట్ తో ఆడిన క్రికెటర్ లాన్స్ క్లూస్నెర్.
1990 లకు పూర్వం బ్యాట్స్ మన్లు తేలికపాటి పొట్టి బ్యాట్లతో ఆడేవారు.
నాలుగు వందల సంవత్సరాల క్రికెట్ చరిత్రలో రకరకాల బ్యాట్లు వాడకంలోకొచ్చాయి.
1624లో మైదటిసారిగా బ్యాట్లు వాడకంలోకొచ్చాయి.
తొలి రోజుల్లో బ్యాట్లు హాకీ స్టిక్ లా ఉండేవి.
1800 తర్వాత బ్యాట్లలో కొత్త మార్పులొచ్చాయి. అయితే కొందరు బ్యాట్స్ మన్లు స్టంప్స్ సైజ్ కన్నా పెద్దవాటితో ఆడేవారు. కానీ రాణించలేకపోయారు. అప్పట్లో కేవలం ఇంగ్లండ్ లోని విల్లో చెట్లతోనే బ్యాట్లు తయారుచేసేవారు. అప్పట్లో ఒక్కో బ్యాట్ ఖరీదు అయిదు పౌండ్ల దాకా ఉండేవి.
తర్వాత్తర్వాత ఇతర చెట్లతోనూ బ్యాట్లు తయారుచేయడం మొదలుపెట్టారు.
ఒకవేళ హాకీ స్టిక్కు లాంటి బ్యాట్లతో ఆడి ఉంటే డాన్ బ్రాడ్మన్, జాక్ హాబ్స్, విక్టర్ ట్రంపర్ తదితరులు ఉండేవారు కాదు.
1960లలో బ్యాట్స్ మెన్ ఎక్కువగా హుక్ షాట్, పుల్ షాట్ కే మొగ్గు చూపేవారు. కానీ గ్రామీ పొల్లాక్, వివియన్ రిచర్డ్స్ వంటివారు భారీ బ్యాట్ లతో ఆడటం మొదలుపెట్టి సంచలనం సృష్టించారు.
18 వ శతాబ్దం చివర్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తదితర దేశాలలోనూ క్రికెట్ ఆడే వారి సంఖ్య పెరిగింది. అనేక జట్లు రంగంలోకి దిగాయి. ఆయా దేశాలు సొంతంగా బ్యాట్లు తయారు చేయడం మొదలుపెట్టాయి. భారత్, పాకిస్తాన్ దేశాలలో కాశ్మీర్ లోని విల్లో చెట్లను బ్యాట్ల తయారీకి ఉపయోగించడం మొదలుపెట్టారు.
ఆధునిక కాలంలో బ్యాట్ పొడవు ముప్పై ఎనిమిది సెంటీమీటర్లు (965 మిల్లీ మీటర్లు) మించడానికి వీల్లేదు. వెడల్పేమో 4.25 (108 మిల్లీమీటర్లు) సెంటీమీటర్లు మించకూడదు.
2020లో కొన్ని టాప్ క్లాస్ బ్యాట్లు...
1. ఎంఆర్ఎఫ్ రన్ మెషీన్.
2. మసూరి టన్ టి- లైన్.
3. కూకబుర్రా ఫీవర్ ప్రొ 2000.
4. ఎస్జీ ప్లేయర్స్ ఎడిషన్.
5. న్యూ బ్యాలన్స్ డిసి 1080 ప్లేర్స్ ఎడిషన్.
6. గ్రే నికోల్స్ జెయింట్.
7. కింగ్ స్పోర్ట్ డెడ్లీ.
8. కూకబుర్రా ఘోస్ట్ ప్రొ 1500.
9. గన్ & మూర్ డైమండ్ బెన్.
10. స్టోక్స్ ప్లేయర్ ఎడిషన్.
11. కూకబుర్రా షాడో ప్రొ 2000.
అంతర్జాతీయ క్రికెట్లో హెవీ బ్యాట్లను ఉపయోగించిన కొందరు క్రికెటర్లు....
1.లాన్స్ క్లూస్నెర్ / 1.53 కిలోలు. బ్యాట్ పేరు ఎస్ఎస్ జులు.
2.సచిన్ టెండూల్కర్ / 1.47 కిలోలు. బ్యాట్ పేరు ఎంఆర్ఎఫ్, అడిదాస్.
3. క్రిస్ గేల్ / 1.36 కిలోలు. బ్యాట్ పేరు స్పార్టన్ సీజీ యూనివర్సల్ బాస్.
4. వీరేంద్ర సెహ్వాగ్ / 1.35 కిలోలు. బ్యిట్ పేరు ఎస్జీ.
5 ఎం.ఎస్.ధోనీ /1.27కిలోలు. బ్యాట్ పేరు స్పార్టన్.
6. డేవిడ్ వార్నర్ / 1.24 కిలోలు. బ్యాట్ పేరు గారీ నికోల్స్ కబూమ్.
- యామిజాల జగదీశ్
Leave A Comment