సూఫీ కథలు ఒక్క ఆలోచనను లేదా తత్వాన్ని వ్యక్తపరచవు. అవి సూక్ష్మంగా చెప్పే ఆలోచనలు అపారమైనవి.
అనగనగా ఓ వ్యాపారి. అతనికి అందమైన భార్య, ప్రేమగల పిల్లలు. సువిశాల భవంతి. సంపద. సమాజం దృష్టిలో అతనొక విజయవంతమైన వ్యక్తి! కానీ అతని గురించి గర్వపడటానికి ఎవరూ లేరు. అతని ఇంటి తోటలో ఓ పంజరం. అందులో ఓ పాడే పక్షి. ఆ పక్షిని అన్ని సౌకర్యాలతో కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాడు. దానిని ఇష్టమైన ఆహారాలతో పెంచసాగాడు. ఇంటికి అతిథులెవరైనా వస్తే, వారిని పక్షి వద్దకు తీసుకువెళ్ళి చూపిస్తాడు. అప్పుడది పాడుతుంది. దాని పాటకు అతిథులు ఆశ్చర్యపోయేవారు. అప్పుడు వ్యాపారి గర్వంగా చూసేవాడు.
ఒకరోజు ఆ వ్యాపారి విదేశ యాత్రకు సన్నద్ధమయ్యాడు. భార్య, పిల్లలు విదేశాల నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఏం కొనాలని అడుగుతాడు. ప్రతి ఒక్కరూ తమకు కావలసినవి చెప్పారు. అతను తోటలోకి వెళ్ళాడు. ఏంకావాలని పక్షినీ అడిగాడు.
"నేనడిగినవి లభిస్తాయా?"
"నీకేం కావాలో అడుగు. తీసుకొస్తాను!"
"నువ్వెళ్ళే దారిలో ఎక్కడైనా నా జాతికి చెందిన పక్షులు కనిపిస్తే వాటికి నా మాట చెప్పగలవా?" అంటుంది పక్షి.
"ఏ మాట?"
"నేనిక్కడ ఎలా ఉన్నానో, నా పరిస్థితి ఏమిటో వాటికి చెప్పు"
"ఇంతేనా... తప్పకుండా చెప్తాను. అది సరేగానీ ఇంకేమీ కావాలి? ఖరీదైన పప్పులు, గింజలు వంటివేవైనా కావాలా?''
“వద్దు” అంటూ పక్షి పంజరంలోనే పైనున్న చెక్క ఊయల మీద కూర్చుంది.
వ్యాపారి విదేశాలకు వెళ్లాడు.
వ్యాపారం బాగా ముగిసింది. ఇంట్లోవాళ్లు అడిగినవన్నీ వెతికి వెతికి కొన్నాడు. అన్ని పనులు పూర్తయ్యాయి.
ఇత చివరగా పక్షి మాట తీర్చాలనుకున్నాడు. ఆ పక్షి జాతికి చెందిన వాటి కోసం వెతికాడు. ఊరు ఊరంతా తిరిగాడు. చివరికి ఓ అడవిలో అవి కనిపించాయి. ఒక చెట్టు పైన ఓ మూడు పక్షులు కూర్చున్నాయి. వాటి దగ్గరకు వెళ్ళాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు.
“మా ఇంట్లో మీ జాతికి చెందిన పక్షి ఒకటి ఉంది. మిమ్మల్ని చూస్తే తన పరిస్థితి చెప్పమంది. చెప్తున్నాను. వినండి. నేను దానిని ఒక పంజరంలో పెంచుతున్నాను. దానికి కావలసిన అన్ని సౌకర్యాలతో ఓ పంజరం ఏర్పాటు చేసాను. అందులోనే ఉంటుంది. మా ఇంటికి వచ్చే అతిథులకు దానిని చూపిస్తుంటాను. అది మంచిగా పాడుతుంది. చాలా బాగుంటుంది దాని గొంతు. అన్ని రకాల రుచికరమైన ఆహారాన్ని పెడుతుంటాను'' అని అతను చెప్పినవన్నీ
విన్న పక్షులలో ఒకటి వణికిపోయింది. చెట్టు పైనుండి ఠపీమని నేలపై పడింది. పడిన మరుక్షణం విలవిలలాడి ప్రాణాలు వదిలింది. అతను దానిని చూసి కంగుతిన్నాడు.
'ఎందుకు చచ్చిపోయింది?' అనే ప్రశ్న అతన్ని కలవరపెట్టింది.
విచారవదనంతో తిరుగుప్రయాణం చేశాడు వ్యాపారి. దారి పొడవునా అతనిని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే... 'ఆ పక్షి ఎందుకు చనిపోయింది?' అనన్నదే.
వ్యాపారంలో సంపాదించిన డబ్బు, భార్యాపిల్లల కోసం తన వెంట తీసుకెళ్లిన విలువైన వస్తువులు వంటివేవీ గుర్తుకు రాలేదు. చెట్టు మీద నుండి చనిపోయిన పక్షి దృశ్యం మాత్రమే మళ్లీ మళ్లీ కళ్ళ ముందు కదలాడి అతన్ని వెంటాడింది. భోజనం నచ్చలేదు. నౌకలో తనతో పాటు వచ్చిన వారితో మాట్లాడటానికి కూడా అతను ఇష్టపడలేదు. ఇంటికి చేరాడు.
అతను తీసుకొచ్చిన బహుమతులను చూసి భార్య, పిల్లలు ముచ్చటపడ్డారు. అతనిని అభినందించారు. అయితే అతను అన్నింటికీ చిన్నగా నవ్వాడు తప్ప పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత తోటలోకి వెళ్ళాడు ఎంతో ప్రేమగా పెంచుతున్న పక్షిని చూడటానికి. అప్పుడది పంజరంలోని ఊయల మీద ఊగుతోంది. వ్యాపారి దాని చూసి చూడటంతోనే జరిగినదంతా చెప్పాడు. అంతే. అతను చెప్తున్న మాటలను వింటున్న ఆ పక్షి వణుకుతూ ఊయల నుంచి కింద పడింది. అతనికి భయమం వేసింది. దేనికేమైంది అనుకుంటూ పంజరం తలుపు తెరిచాడు. వణుకుతున్న చేతులతో పక్షిని పైకి లేపాడు. అరచేతుల్లో పెట్టుకుని ఏడవసాగాడు. ఏమైందా అని అయోమయంగా చూస్తుండగానే అది రెక్కలు చాపి అతని చేతుల్లోంచి ఎగిరి పక్కనే ఉన్న చెట్టు మీదకు వాలింది.
అప్పుడతనికి వియం బోధ పడింది. ఇంతకాలం బందీగా ఉన్న పక్షి ఇప్పుడు స్వేచ్చగా ఉందన్న విషయాన్ని గ్రహించాడు.
"ఏమిటిది...ఎందుకిలా కింద పడి చచ్చిపోయినట్టు నాటకమాడావు. చెప్పు! " అన్నాడు వ్యాపారి.'
అతని మాటలకు పక్షి “నిజంగా నీకు అర్థం కాలేదా.... నా స్వేచ్ఛే నాకు అందం. చందం. నన్నింత కాలమూ పంజరంలో బంధించేసావన్న వాస్తవాన్ని నువ్వు ఆ అడవిలో కింద పడి మరణించిన నా జాతి పక్షి విషయంతోనే నీకు అర్థమై ఉండాలి. నా పాటను విని పరవశించావు. అందరితోనూ గొప్పగా చెప్పుకున్నావు. కానీ నా స్వేచ్ఛ గురించి నువ్వు ఏ రోజూ ఆలోచించనే లేదు. నా పాట నీకర్థం కాలేదు కనుకే ఆనందించావు. నీ మాటలను నేను మళ్ళీ మళ్ళీ చెప్పగలిగాను కానీ నా బాధను నువ్వు తెలుసుకోలేకపోయావు. నా పాట అంతా స్వేచ్ఛ కోసం పాడిందే. ఎవరు ఎక్కడుండాలో అక్కడ ఉంటేనే వారికి హాయి. ఏ పక్షీ పంజరం జీవితాన్ని కోరుకోదు. నాకిక ఆ జీవితం వద్దు. ఎగరడం నా స్వభావం, నాకు కావలసింది స్వేచ్ఛ. ఇంతకాలానికైనా నాకీ స్వేచ్ఛ లభించింది. ఉంటామరి. మరే పక్షినీ నన్ను బంధించినట్టు బంధించకు''.
-యామిజాల జగదీశ్
Leave A Comment