అదొక అడవి. ఆ అడవిలో బుద్ధుడు మెల్లగా నడుచుకుంటూ పోతున్నాడు.
ఆయన వెనకే ఓ కోతి. చాలాసేపటి నుంచి అది ఆయన వెంటే నడుస్తోంది. కొంత దూరం వచ్చిన తరువాత బుద్ధుడు వెనక్కు తిరిగి చూసాడు.
కోతి ఆ క్షణంలోనే ఒక్క ఎగురు ఎగిరి ఓ చెట్టు కొమ్మమీద కూర్చుంది.
అక్కడి నుంచి బుద్ధుడి వంకే చూస్తోంది.
బుద్ధుడు ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగాడు బుద్ధుడు.
ఇదిగో నువ్వెవరో నాకు తెలీదు. కానీ నన్ను చులకనగా చూడకు. నేను సామాన్యమైన దానిని కాను. నేననుకుంటే ఏదైనా చెయ్యగలను. నా నిఘంటువులో అసాధ్యమన్న మాటకు తావు లేదు. ఏదన్నా చేస్తాను. నాకు తెలియందంటూ లేదు అని ఏదేదో చెప్పుకుంటూ పోయింది.
అలాగా... అయితే ఓ పందెం వేసుకుందామా అని అడిగాడు బుద్ధుడు.
దానికేం...తప్పకుండా...ఏం చెయ్యాలో చెప్పు అని అడిగింది కోతి.
ఇంకేమీ కాదు...ఇప్పుడు నేల మీద నుంచి ఎగిరి ఆ కొమ్మ మీద కూర్చున్నావు కదా...అక్కడి నుంచి దూకి నా అర చేతిలో కూర్చోవాలి. సరేనా అని అడిగాడు బుద్ధుడు.
అంతేనా...నువ్వు చెప్పినట్టే నేను అరచేతిలో కూర్చుంటే ఏమిస్తావు కానుక అని అడిగింది కోతి.
స్వర్గంలో ఉన్న చక్రవర్తిని పిలిచి నాతో ఉండమని అడిగాను...ఆ సమయంలో స్వర్గంలో ఆయన సింహాసనం ఖాళీ అవుతుంది. నువ్వందులో కూర్చోవాలి అని అన్నాడు బుద్ధుడు. అలా కాకుండా నువ్వు గానీ పందెంలో ఓడిపోతే ఓ కొంత కాలం ఈ భూమ్మీద ఉండాలి. ఆ తర్వాతే నువ్వు నా దగ్గరకు రాగలవు అని చెప్పాడు బుద్ధుడు.
కోతికి దూకడం ఓ పనా...దూకడం అనేది నాకు చాలా సులభమైన పని. ఏమిటీ ఇప్పుడే నీ అరచేతిలోకి దూకనా అని అడిగింది కోతి.
సరే అని బుద్ధుడు అర చేయి చాచాడు.
ఆయన చేయి ఓ తామర ఆకంత ఉంది. కోతికి ఆ అరచేతిలో కూర్చోవడానికి వీలుగా ఉంది.
కోతి దూకడానికి సిద్ధపడింది
అయితే ఆ క్షణంలో దానికో ఆలోచన వచ్చింది.
ఈ కొమ్మ నుంచి మరొక కొమ్మకు దూకడం అన్నది నాకు అతి మామూలు విషయం. నా ప్రతిభకు బుద్ధుడు విసిరిన సవాలు తగినదేనా అనుకుంది. అయినా ఆయన అర చేతిలో దూకడం కన్నా పైపైకి ఎగిరి పైలోకానికి పోయి కాస్సేపు అక్కడ గడిపి కిందకు వచ్చేస్తే సరిపోతుందిగా అనుకుంది కోతి.
అయిదు నిముషాలైనా అది దూకక పోయేసరికి బుద్ధుడు ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు.
ఏమీ లేదు...ఇదిగో దూకేస్తున్నా అంటూ అది పై పైకి ఎగురుకుంటూ పైలోకానికి పోయింది. అక్కడ అయిదు స్తంభాలు. మిళమిళ మెరుస్తున్నాయి. ఎరుపు రంగులో ఉన్నాయి.
కోతి వాటిని చూసి ఇలా అనుకుంది...
బుద్ధుడి దగ్గరకు వెళ్ళి ఈ స్తంభాల గురించి చెప్తే ఆశ్చర్యపోతాడు కదా అని.
ఏదైనా ఒక స్తంభంలో తన గుర్తు ఉండేలా ఏదన్నా చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా కోతి ఓ స్తంభంలో ఏదో రాసింది.
ఏమిటో తెలుసా...
ఓ మహాజ్ఞాని ఇక్కడికి వచ్చి వెళ్ళాడు అని రాసింది. అక్కడి నుంచి కిందకు దూకి బుద్ధుడి అరచేతిలో కూర్చుంది.
ఏమిటీ చూసేవే నా శక్తి...పైలోకంలో ఉన్నఅయిదు స్తంభాలను చూసొచ్చాను అంటూ ఓ స్తంభాన తాను రాసిన మాటలను చెప్పింది.
అలాగా అని అడిగాడు బుద్ధుడు.
అవును...నీకు అనుమానమైతే నాతో రా అక్కడికి తీసుకుపోతాను అంది కోతి.
అయితే బుద్దుడు అన్నాడు...అదేమీ అక్కర్లేదని. సరేగానీ కాస్తంత కిందకు వంగి చూడు అని చెప్పాడు బుద్ధుడు.
కోతి కిందకు వంగి చూడగా అక్కడ బుద్ధుడి అరచేయి కనిపించింది. తీక్షణగా చూసింది. బుద్ధుడి ఓ వేలిలో కోతి రాసిన మాటలు కనిపించాయి.
కోతి ఆలోచనలో పడింది.
అలాగా...ఆకాశంలో నేను చూసింది బుద్ధుడి వేళ్ళా...అని కోతి విస్తుపోయింది.
దాంతో కోతి గర్వం అణగిపోయింది.
మన మనసే ఈ కోతి. మనసు అనేది, అహంకారం అనేది ఓ నాణానికి రెండు వైపులున్న బొమ్మా బొరుసు లాంటివే. మనసున్నంత వరకూ అహంకారం ఉంటుంది. మనసు నశిస్తేనే అహంకారం నశిస్తుంది. మనసు నశించాలని పెద్దవాళ్ళు చెప్పేది ఈ అర్థంలోనేసుమా.
నాకు తెలిసిన ఒకతను విసిరిన సవాల్ మరోలాంటిది.
అతను ఓ కాలువ దాటుతానని పందెం కాసి దూకడానికి ప్రయత్నించి కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు.
ఏమిట్రా వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావుగా...ఇప్పుడేమైంది అని అడిగాను.
నేను పందెం కాసిన సమయం బాగు లేదు అన్నాడు.
ఎందుకలా అంటున్నావు అని అడిగాను.
కాలువలో నీరుండగా పందెం కాసి ఉంటే బాగుండేది కానీ లేని టైములో పందెం కాయడంతో ఈ గతి పట్టిందన్నాడు.
- యామిజాల జగదీశ్
Leave A Comment