చీమల నుంచీ ఒక పాఠం
---------------------------------
ప్రకృతి మనకు మానవత్వం గురించి ఏదో రూపేణా అడుగడుగుకీ నేర్పుతుంది. కానీ అన్నీ తెలుసుకునే మనిషి వాటిలో పట్టించుకునేది కొన్నింటినే. అధిక శాతం నిర్లక్ష్యం చేస్తాడు.
ఒక రోజు ఉదయం, ఒకతను ఉదయాన్నే నిద్రలేచి ఒక విచిత్ర విషయాన్ని గమనించాడు.
అతను క్రితం రోజు రాత్రి పడుకోవడానికి ముందర మూత పెట్టటం మరచిన ఐదు లీటర్ల నీటి సీసాలో డజన్ల కొద్దీ చీమలు పడి ఉన్నాయి. అవి నీటిలో అస్తవ్యస్తంగా కదులుతున్నాయి. ఆ కదలికలను చూస్తుంటే అతనిలా అనుకున్నాడు... చీమలు వేటికవి తమ ప్రాణాల కోసం పోరాడుతున్నట్లుగా...తమను తాము కాపాడుకోవడానికి ఇతర చీమలను వెనకకు నెట్టేస్తున్నట్లుగా... ఒకదానితో ఒకటి ఘర్షణపడుతున్న ట్లుగా...అతనికి చీమల పట్ల ఏహ్యభావం కలిగింది. ఛీ ఛీ అవి ఎంత నిస్వార్థంగా ఉన్నాయోనని అనుకుని చీమలపట్ల ఓ నిర్లక్ష్య భావంతో వాటి విషయంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించు కున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అయితే రెండు గంటల తర్వాత అతనిలోని ఉత్సుకత పైకొచ్చింది. సీసాలో పడ్డ చీమలు ఏమైపోయి ఉంటాయోనని చూడాలనుకున్నాడు.
అతను సీసాలోకి చూసినప్పుడు నోటంట మాట లేదు. అవి అన్నీ సజీవంగా ఉన్నాయి. కేవలం సజీవంగానే కాదు, ఐక్యంగానూ ఉన్నాయి. అవి ఒక సజీవ ద్వీపాన్ని, తమ శరీరాలతో తేలియాడే పిరమిడ్‌ను నిర్మించుకున్నా యనిపించింది. కొన్ని చీమలు పైకొచ్చాయి. మరికొన్ని నీటిలో అంటూ ఇటూ తిరుగుతున్నాయి. అడుగున ఉన్నవేమో పైకొస్తున్నాయి. పైనున్నవేమో దిగువకు పోతున్నాయి. కింద ఉన్న వాటిని పైకి తీసుకొచ్చే పనిలో ఉన్నాయి. అంతేతప్ప వేటికవి తప్పించుకుని ప్రాణాలతో బయటపడి పోవాలనే స్వార్థబుద్ధి వాటిలో కనిపించలేదు. పరస్పరం సహకరించుకుంటున్నాయనే విషయం అతన్ని ఆలోచనలో పడేసింది. ప్రతి చీమ మిగిలిన చీమల మంచి కోసం కృషి చేస్తున్నాయి. వాటి మధ్య ఉన్న సమన్వయం, నిస్వార్థత అతనిని తీవ్రంగా కదిలించాయి.
అంతే, ఆ క్షణంలోనే అతనిలో ఓ మంచి ఆలోచన పుట్టింది. సీసాలోపల పెట్టగలిగే ఒక చెంచా తీసుకుని చీమలను మెల్లగా పైకి తీసుకురావడం ప్రారంభించాడు. ఆ చెంచాను ఆసరాగా చేసుకుని
అవి ఒక్కొక్కటిగా, వరుసక్రమంలో భయం లేకుండా పైకొస్తున్నాయి.
ఇంతలో అలసిపోయిన ఒకటి రెండు చీమలు జారి నీటిలో పడిపోయాయి.
ఇంతలో మరపురానిది జరిగింది.
దాదాపు సురక్షితంగా ఉన్న చివరి చీమ అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూసింది. అది అమాంతం దిగువకు దూసుకెళ్లింది.
"ఆగండి, మిత్రమా ఆగండి, నేను మిమ్మల్ని విడిచిపెట్టి పోను" అని చెప్పినట్లుగా అన్పించింది ఆ చీమ వైఖరి అతనికి. అది మునిగిపోతున్న ఒకటి రెండు చీమలను చెంచా దగ్గరకు తీసుకువచ్చాడు. అవి కలిసిమెలసి చెంచా సాయంతో బయటకు వచ్చాయి. చీమలు తమను కాపాడుకున్న ఈ తీరంతా చూసినప్పుడు అతనికిలా అనిపించింది....
స్నేహం గురించి ఏ సినిమానో లేదా పుస్తకమో చెప్పలేని విధంగా ఆ చీమలు వైఖరి ఉందనిపించింది.. అతని హృదయాన్ని కదిలించింది.
అతను భావోద్వేగాలను అనుభవించాడు. సిగ్గు, విస్మయం, ప్రశంస. తొలుత, వాటిని తక్కువ అంచనా వేసినందుకు సిగ్గు పడ్డాడు.
వాటి పట్ల ఉన్న ఐక్యత అతనిని విస్మయపరిచింది. వాటి ధైర్యం, కరుణ చూసి చీమలను ప్రశంసించేలా చేశాయి.
ఈ క్రమంలో అతను గ్రహించినది...
మానవులు తరచుగా గోడలు నిర్మిస్తారు. అక్కడ ప్రకృతి మనకు వంతెనలను ఎలా నిర్మించాలో చూపిస్తుంది.
మనం మన స్వంత మనుగడ కోసం వెంబడిస్తాం. వెనుకబడిన వారిని మరచిపోతాము.
చిన్నపాటి జీవులైన చీమల సానుభూతినీ, సహకారాన్నీ మనిషి సాటి మనిషిపట్ల చూపించగలిగితే ఎంత బాగుంటుందో కదా అనుకున్నాడు.
ఉన్నతుడిగా భావించే మనిషేమో ఇతరుల బాధలను తరచుగా విస్మరిస్తాడు. చూసీచూడనట్లు వెళ్ళిపోతాడు కదా అనుకున్న ఆ వ్యక్తి
ఆ రోజు, అతను చీమల నుంచి లోతైన విషయం నేర్చుకున్నాడు .
నిజమైన బలాన్ని ఐక్యతలో చూసాడు. ఎవరైనా ఇప్పటికీ సరిగ్గా ఎలా జీవించాలో తెలియకపోతే
బహుశా చీమల నుండి నేర్చుకోవలసిన సమయం ఆసన్నమైందనుకోవాలన్నది అతని అభిప్రాయం.
- యామిజాల జగదీశ్
Leave A Comment