• Login / Register
  • క్రీడలు

    ఐపీఎల్‌ నా జీవితాన్ని మార్చివేసింది: విప్రాజ్‌ నిగమ్‌

    ఐపీఎల్‌ నా జీవితాన్ని మార్చివేసింది: విప్రాజ్‌ నిగమ్‌

    దిల్లీ: ఐపీఎల్‌  తన జీవితంలో చాలా మార్పులకు కారణమైందని దిల్లీ క్యాపిటల్స్‌  ఆల్‌రౌండర్‌ విప్రాజ్‌ నిగమ్‌  అన్నాడు. క్రికెట్‌ దిగ్గజాలతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం వల్ల తన ఆట మెరుగవుతోందని ఆనందం వ్యక్తం చేశాడు. విప్రాజ్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ రూ.50లక్షలు వెచ్చించి వేలంలో దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో అతడు ఐపీఎల్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తున్నాడు.

    ‘ఐపీఎల్‌తో నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. సీనియర్ ఆటగాళ్లతో మైదానాన్ని పంచుకొని, వారి నుంచి ఆటలో మెళకువలు  నేర్చుకునే అవకాశం లభిస్తోంది. దిల్లీ క్యాపిటల్స్ నన్ను ఎంపిక చేసినప్పుడు.. నా కోచ్‌లు, యాజమాన్యంతో చర్చించాను. లీగ్, దేశవాళీ క్రికెట్‌లో వారు నా బ్యాటింగ్‌ను చూశారు. నేను ఆల్ రౌండర్‌ పాత్ర పోషించాలని వారు ఎప్పుడూ నాకు చెబుతుండేవారు. అందుకే బ్యాటింగ్‌, బౌలింగ్‌.. రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తున్నా’ అని విప్రాజ్‌ అన్నాడు. 

    నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్లి వచ్చిన తర్వాత తన ఆటలో వచ్చిన మార్పుల గురించి వివరించాడు. ‘నేను ఎన్‌సీఏకు వెళ్లిన తర్వాత ముగ్గురు కోచ్‌లు నా ప్రగతికి కారణమయ్యారు. నేను నిజానికి బ్యాటర్‌గా వెళ్లాను. కానీ అక్కడ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండూ ప్రాక్టీస్‌ చేశా. ఒక లెగ్‌ స్పిన్నర్‌గా బౌలింగ్‌ను సీరియస్‌గా తీసుకోమని వారు నాకు సూచించారు. నేను మొదట్లో పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా కొన్ని ఓవర్లు బౌలింగ్‌ చేసేవాణ్ని. కానీ ఎన్‌సీఏకు వెళ్లిన తర్వాత నా ఆలోచన ధోరణి పూర్తిగా మారింది’ అని విప్రాజ్‌ నిగమ్‌ చెప్పుకొచ్చాడు.

    Leave A Comment