రతన్ టాటా హబ్: 50 కోట్లు సీడ్ ఫండింగ్, 5 స్పోక్స్‌కు 30 కోట్లు
మీ ఆలోచనలే పెట్టుబడి - ఆవిష్కరణలే ఆయుధం - ఆకాశమే హద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో స్టార్టప్‌లు మరియు ఆవిష్కరణల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ దిశగా, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ & స్టార్టప్ పాలసీ (4.0) 2024-2029 కింద ప్రతిష్టాత్మకమైన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)కు ప్రారంభ సీడ్ కేపిటల్‌గా రూ. 50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అంతేకాకుండా, ఈ హబ్‌కు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న ఐదు ప్రాంతీయ స్పోక్స్‌కు ఒక్కొక్కదానికి రూ. 30 కోట్ల చొప్పున నిధులు కేటాయించడం జరిగింది.
సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ (ప్రోత్సాహక) శాఖ ఈ మేరకు జీ.ఓ.ఎం.ఎస్.నెం.14ను విడుదల చేసింది. ఈ ప్రభుత్వ చర్య రాష్ట్రంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్టార్టప్‌లు మరియు వినూత్న ఆలోచనలను మరింతగా పెంపొందించడానికి దోహదపడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు దాని అనుబంధ స్పోక్స్‌ను ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను కార్యరూపంలోకి తీసుకురావడానికి మరియు ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి ఈ నిధుల విడుదల ఎంతో కీలకం కానుంది.
ఈ నేపథ్యంలో, అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను మరియు ఐదు ప్రాంతీయ స్పోక్స్‌ను కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 8 ప్రకారం లాభాపేక్ష లేని సంస్థలుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఏపీఐ...) సీఈఓ ఈ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు స్పోక్స్‌ను విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
ఈ ప్రభుత్వ చర్య ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను గణనీయంగా బలపరుస్తుందని, యువతలో పారిశ్రామిక స్ఫూర్తిని మరింతగా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ఇన్నోవేషన్ హబ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది.
Leave A Comment