• Login / Register
  • Site Logo

    మేరీ ఎల్లెన్

    జీవనశైలి
    మేరీ ఎల్లెన్ 
    ----------------
    అందరికీ ఎప్పుడో అప్పుడు ఏదో రూపంలో అవకాశాలు వస్తాయి. కానీ  అవకాశం వచ్చినప్పుడు కొందరే అందిపుచ్చుకుంటారు. మరికొందరు తొందరపాటుతో అవకాశాన్ని చేజార్చుకుంటారు. ధైర్యవంతులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా పెట్టుబడి పెట్టడానికి మార్గాలను కనుగొంటారు. మేరీ ఎల్లెన్ ప్లెజెంట్ అలాంటి వ్యక్తులలో ఒకరు.

    1800ల ప్రారంభంలో ఆఫ్రికన్ సంతతికి చెందిన ఆమె, జాతి, లింగం, తరగతి కఠినమైన అడ్డంకులుగా ఉన్న కాలంలో జీవించిన స్త్రీ. అయినప్పటికీ ఆమె వ్యవస్థలోని వ్యత్యాసాలనే సవాలుగా తీసుకుని వాటిని మెట్లుగా మార్చింది. 

    కాలిఫోర్నియాలో, ఆమె జీవనోపాధి కోసం మాత్రమే కాకుండా, ఆర్థిక శక్తి కోసం తనను తాను నిలబెట్టు కోవడానికి శాన్ ఫ్రాన్సిస్కోలోని  ఉన్నత వర్గాల ఇళ్లల్లో పనులు చేసింది. ఇంటి యజమానులకు
    భోజనం వడ్డిస్తూ వారి మాటలను నిశితంగా విన్నారు. ఈ క్రమంలోనే ఆమె పెరుగుతున్న వెంచర్‌ల పేర్లు, సంపద సృష్టి లయలను గ్రహించింది.  ఆమె వాటిని అధ్యయనం చేసింది. ఆమె తన సంపాదనను లాండ్రీలు, బోర్డింగ్ హౌస్‌లు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టింది. తరచుగా ఆమె తన వ్యవహారాలను దాస్తూ వచ్చింది. ఆమె లాభాలను బంగారం, వెండి గనులు, రవాణా కంపెనీలు, రెస్టారెంట్లలో పెట్టింది. 

    ఆమె వ్యూహం అద్భుతమైంది. ఆమె అనుకున్నదంతా కలిసొచ్చింది. 1800ల చివరి నాటికి, ఆమె విలువ లక్షల్లో ఉండేది. బహుశా నేటి డాలర్లలో బిలియన్‌కు చేరువై ఉండొచ్చు.

    కానీ ప్లెజెంట్ వారసత్వం కేవలం ఆర్థికం మాత్రమే కాదు. ఆమె తన సంపదను సమాజంలోని కొన్ని సేవా కార్యక్రమాలకూ వినియోగించింది. ఇలావుండగా, కొంత కాలానికి వార్తాపత్రికలలో ఆమెపై దుష్ప్రచారం జరిగింది, "వూడూ క్వీన్" అని పిలిచేవారు. వూడూ రాణి అంటే చారిత్రాత్మకంగా అత్యంత గౌరవనీయమైన, శక్తిమంతమైన మహిళా నాయకురాలు అని అర్థం. ఆమె చట్టపరమైన పోరాటాలను ఎదుర్కో వలసి వచ్చింది. కానీ ఆమె ఎప్పుడూ తాననుకున్న కార్యక్రమాలను ఆపలేదు. అనుకున్నది సాధించడంలో ఎప్పుడూ ముందుండేది.

    - యామిజాల జగదీశ్

    Download Main Image

    Leave A Comment