• Login / Register
  • Site Logo

    తమిళ సినిమాలో తొలి గేయ రచయిత భాస్కరదాస్

    హోమ్

    ----------------------------
    మధురకవి భాస్కర దాస్ (1892 - 1952) తమిళ సినీ చరిత్రలో మొట్టమొదటి గేయరచయిత. ఆయన బహుముఖ ప్రతిభావంతుడు.

    ఆయన తన పదహారో ఏట పాటలు రాయడనికి శ్రీకారం చుట్టారు.

    రామనాథపురం రాజా భాస్కరసేతుపతి ఆస్థానకవిగా ఉండిన భాస్కరదాస్ అసలు పేరు వెల్లయ్ చ్చామి. ఆస్థానకవి హోదానంతరం ఆయన పేరు భాస్కర దాస్ గా మారింది.

    1931లో తమిళంలో విడుదలైన తొలి టాకీ చిత్రం కాళిదాస్ లో అన్ని పాటలనూ ఈయన రాశారు.

    తన నాటకం కోసం రాసిన పాటలను సైతం ఈ సినిమాకు వాడుకున్నారు.

    మధురకవి భాస్కరదాస్ సంగీతం, నాటకం, స్క్రీన్ ప్లే, సంభాషణలు, పాటలు ఇలా అన్నింట్లోనూ మంచి ప్రవేశముండటమేకాక నాటకాలలో నటించిన అనుభవముండేది. దీంతోనే ఆయన పలువురికి నటనలోనూ శిక్షణ ఇవ్వగలిగారు. జానపద పాటలను సేకరించేవారు అలాగే ఆధునిక సంగీతంలోనూ పరిచయమున్న భాస్కరదాస్ పాటలు "మధురకవి భాస్కర దాస్ కీర్తనలు" అనే పేరుతో రూపొందాయి.

    1892 జూన్ ఆరవ తేదీన తూత్తుక్కుడి జిల్లా నాగలాపురంలో జన్మించారు. 

    నాగలాపురంలోని పల్లావాసల్ వీధిలో ఆయన పుట్టిపెరిగిన ఇల్లు శిథిలావస్థలో ఉంది.

    యవ్వనప్రాయంలోనే ఆయన మదురైలో ఉంటున్న తన బామ్మ ఇంటికి వెళ్ళారు. అక్కడే నాటక కళాకారుడిగా ఎదిగారు.

    ఆయనకు మగపిల్లలు అయిదుగురు. వారి పేర్లు ... వేల్ సామి, సేతు, మరుదపాండి, దినకరన్, మనోహరన్. కుమార్తెలు ఆరుగురు. వారి పేర్లు - సరస్వతి, ఇందురాణి, జానకి, ముత్తులక్ష్మి, కాంతిమతి, కమల. ఆయన రెండవ భార్య పేరు ఒండియమ్మాళ్.

    ఆయన రాసిన తొలి పాటల పుస్తకం 1915లో భక్తి రసప్రధాన కీర్తన పేరుతో అచ్చయింది.

    1925లో హిందూ దేశాభిమానిగళ్ సెందమిళ్  తిలగం పుస్తకాన్ని ఆవిష్కరించిన భాస్కరదాస్ ఈ పుస్తకం తాలూకు రెండవ భాగాన్ని కూడా 1925లోనే ముద్రించారు.

    గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలంటే ఎంతో ఇష్టమున్న ఈయన ఖద్దర్ వస్త్రాలనే ధరించారు. 

    ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పాటలు రాసి వేదికలపై పాడినందుకు గాను ఇరవై తొమ్మిసార్లు అరెస్టయ్యారు.

    ఆయన పాటలను పాడిన విశ్వనాథదాస్, ఖాదర్ బాషావంటి గాయకులనుకూడా ఆరోజుల్లో పోలీసులు అరెస్టు చేసారు.

    1921లో గాంధీజీ మదురై వచ్చినప్పుడు భాస్కరదాస్ "గాంధీజీ పరమ పేద సాధువు అనే అర్థంలో పాట రాసి ఆలపించగా గాంధీజీ ఆ పాటను విన్నారు.

    ఆయనకు వేదికలపైనేకాక విడిగా పొందిన డబ్బుని, కానుకలను సహ కళాకారులకు ఇచ్చేసేవారు.

    కులమత భేదాలెంచక సహ కళాకారుల ఇళ్ళల్లో భోంచేసేవారు. వారిని తన ఇంటికీ ఆహ్వానించి అన్నం పెట్టేవారు.

    అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భాస్కరదాస్ కులాంతర వివాహాలను ప్రోత్సహించేవారు. ఆయనే దగ్గరుండి ఇటువంటి పెళ్ళిళ్ళు చేయించేవారు. ఓమారు కులాంతర వివాహం చేసుకున్న ఓ వధువుకి బంగారు గొలుసు, పట్టుచీర కానుకగా సమర్పించారు.

    డబ్బులు లేని రోజుల్లో ప్రామిసరీ నోట్ రాసిచ్చి,  వస్తువులను తాకట్టుపెట్టేవారు. అంతేకాదు, తన దగ్గరలేకున్నా అప్పుచేసి ఆర్థికసాయం చేసేవారు.

    నాటకాలాడుతూనే రైతుగానూ కష్టించేవారు.

     తన నాటకాలతోనూ పాటలతోనూ ప్రజలలో దేశభక్తిని పెంపొందించారు.

    ఆయన పాటలు ఎందరినో ప్రభావితం చేసాయి. పలువురు ఆయన పిలుపుతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు.

    ఆయన రాసిన పాటలు చాలావరకు త్యాగమూర్తుల శక్తియుక్తులకు సంబంధించినవిగా ఉండేవి.

    ఆంగ్లేయులకేమాత్రం భయపడకుండా ప్రతి పాటలోనూ తన పేరుని రాసేవారు. 

    మదురై కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యనాథయ్యర్ తో మాట్లాడి మదురైలో నటులతో కలిసి మద్యపాన నిషేధ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోరాట సమయంలోనే ఓ మూడు నెలలపాటు పాండిచ్చేరిలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

     గాంధీజీతోపాటు నాటి సమర యోధులందరితోనూ సంప్రతింపులు జరుపుతుండేవారు.

    నాటకాలపై మక్కువతో తమిళనాడు అంతా పర్యటించి నాటకాలు వేశారు. కేరళలోనూ నాటకాలు వేశారు. 

    తర్వాతిరోజుల్లో కమ్యూనిస్ట్ నేత కె.పి. జానకియమ్మాళ్ ఈయన నాటకాలలో ప్రత్యేకించి నటించడం విశేషం. 

    మదురొ అమెరికన్ కాలేజీ విద్యార్థులకు‌, స్కూల్ విద్యార్థీలకూ నటనలో శిక్షణ ఇచ్చారు.

    ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, కిట్టప్పా, కె.పి. సుందరాంబాళ్ వంటి గాయనీగాయకులు ఈయన రాసిన పాటలు విరివిగా పాడుతుండేవారు 

     ఆయన పాటలెన్నో గ్రామ్ ఫోన్ రికార్డులుగా విడుదలయ్యాయి. వాటిలో వందేమాతరం మన జీవితానికి ఆధారం అనే పాటకు విశేష ఆదరణ లభించింది.

    మదురైలో 1940లలో చిత్రకళా అనే స్టూడియోతో సన్నిహిత సంబంధాలుండిన భాస్కరదాస్ అక్కడున్నప్పుడే సుబ్బులక్ష్మికి పాటలు రాసిస్తే ఆవిడ పాడుతుండేవారు.

     1926లో మదురై నటీనటుల సంఘానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సంఘం ఎందరో నటులను వెలుగులోకి తీసుకొచ్చింది.

    ఆయన చివరిరోజుల్లో అనారోగ్యంపాలై మందులతో గడపాల్సివచ్చింది. చికిత్స ఫలించక ఆయన 1952 డిసెంబర్ 20వ తేదీన మరణించారు.

    ఆయన స్మృత్యర్థం మదురైలో ఓ వీధికి మధురకవి భాస్కరదాస్ పేరు పెట్టారు. ఆయన సమొధి నాగలాపురంలో ఉంది.

    భాస్కర దాస్ పాటలు రాసిన సినిమాలు - 
    కాళిదాస్ (1931), వల్లి తిరుమణం (1933), భోజరాజన్ (1935), చంద్రహాసన్ (1936), రాజా దేశింగ్ (1936), ఉషా కళ్యాణం (1936), దేవదాస్ (1937), సతి అహల్య (1936), రాజశేఖరన్ (1937), కోదయిన్ కాదల్ (1941), నవీన తెనాలిరామన్ (1941).

    - యామిజాల జగదీశ్

    Download Main Image

    Leave A Comment