అమెరికా యుద్ధ విధాన అండర్ సెక్రటరీ ఎల్‌బ్రిడ్జ్ కాల్బీతో వినయ్ క్వాత్రా
హ్యూస్టన్: అంతరిక్షరంగ భాగస్వామ్యంలో భారత్, అమెరికా సరికొత్త దిశగా ముందుకెళ్తున్నాయి. అధికారులు, వ్యోమగాములతో వాషింగ్టన్ డీసీలో భారత రాయబార కార్యాలయం తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య దశాబ్దాల నుంచి ఉన్న సహకారం.. చంద్రుడు, అంగారకుడిపై ప్రయోగాలకు ఏ విధంగా మార్గం సుగమం చేసిందో దీనిలో వివరించారు. రెండు దేశాలు కలిసి ఇటీవల చేపట్టిన నైసర్ ఉపగ్రహ, యాక్సియం మిషన్-4 ప్రయోగాల విజయంపై ఇందులో సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా మాట్లాడారు. శాస్త్రీయ అన్వేషణ, సాంకేతికాభివృద్ధి, వాణిజ్య సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే క్రియాశీల వేదికగా భారత్-అమెరికాల అంతరిక్ష భాగస్వామ్యాన్ని ఆయన అభివర్ణించారు. తక్కువ వ్యయంతో కూడిన అన్వేషణలో భారత అంతరిక్ష రంగం గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని చెప్పారు. ఇటీవల అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బచ్ విల్మోర్, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వర్చువల్‌గా పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నారు.
ఐఎస్‌ఎస్‌కు చేరిన క్యాప్సూల్
కేప్‌కెనావెరాల్: ఇంజిన్ మొరాయించడంతో ఒకరోజు ఆలస్యంగా సరకు రవాణా వ్యోమనౌక గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరకుంది. ఐదు టన్నుల సరకును తీసుకువెళ్లిన క్యాప్సూల్‌ను ఐఎస్‌ఎస్‌లోని రోబో హస్తంతో అనుసంధానం చేయగలిగారు. ఫ్లోరిడా నుంచి మూడురోజుల క్రితం ఇది బయల్దేరింది. దీనిలో ఆహారంతోపాటు శాస్త్రీయ పరిశోధనలకు కావాల్సిన పరికరాలు ఉన్నాయి.
Leave A Comment