మళ్లీ ఎదురు కాల్పులు..
నలుగురు మావోల మృతి
గడ్చిరోలి: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీస్ స్పెషల్ కమాండో యూనిట్ సీ-60, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా గడ్చిరోలి జిల్లాలో ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కవండే ప్రాంతంలో ఇటీవల ప్రారంభించిన ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్‌వోబీ) సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం ఆధారంగా గురువారం మధ్యాహ్నం ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. భారీ వర్షం మధ్య దాదాపు 300 మంది సీ-60 కమాండోలు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆపరేషన్ నిర్వహించారని.. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు సమర్థమంతంగా తిప్పికొట్టాయని పేర్కొన్నారు.
దాదాపు రెండు గంటల పాటు కాల్పుల అనంతరం భద్రతాదళాలు గాలించగా నలుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో కొన్ని తుపాకులు, వాకీటాకీ, నక్సల్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతతో పాటు 27మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.
Leave A Comment