• Login / Register
  • Site Logo

    నాన్నా.. పైలట్‌ ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా -కెప్టెన్ సుమిత్

    హోమ్
    నాన్నా.. పైలట్‌ ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా
    -కెప్టెన్ సుమిత్


    ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం గురువారం  ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.  ప్రమాదం అనంతరం ఈ విమానానికి పైలట్‌గా ఉన్న కెప్టెన్‌ సుమిత్‌ సబర్వాల్‌కు సంబంధించిన విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

    కెప్టెన్‌ సుమిత్‌ కు 8,200 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు  పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది. అయితే కెప్టెన్ సుమిత్‌ సభర్వాల్ తండ్రి వయోభారంతో బాధపడుతుండడంతో సుమిత్‌ ఉద్యోగం మానేసి.. ఒంటరిగా ఉన్న తన తండ్రిని చూసుకోవాలని అనుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ముంబయిలోని పోవై ప్రాంతంలో అతడి తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)లో విధులు నిర్వహించి.. పదవీవిరమణ పొందారు. అతడి ఇద్దరు మేనళ్లుల్లు కూడా పైలట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
    ఇటీవల ఆయన వద్దకు వెళ్లిన సుమిత్‌ ‘త్వరలో ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్నా’ అని తన తండ్రికి మాటిచ్చారని.. ఇంతలోనే ఘోరం జరిగిందని సన్నిహితులు వాపోయారు. ఇప్పుడు అతడి తండ్రి ఒంటరివాడయ్యాడని కన్నీరుమున్నీరయ్యారు. ఆయన నివాసానికి చేరుకున్న పలువురు అధికారులు, రాజకీయ నేతలు సుమిత్‌ తండ్రిని ఓదార్చారు. కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్‌గా వ్యవహరించిన క్లైవ్‌ కుండర్‌కు కూడా 1,100 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయన తల్లి ఎయిర్‌ ఇండియాలో విమాన సహాయకురాలిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు సిడ్నీలో ఉండే తన సోదరి దగ్గర ఉన్నట్లు సమాచారం. 

    గురువారం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయలుదేరిన ఎయిరిండియా ఏI171 ఫ్లైట్‌  టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్‌పోర్టును ఆనుకొని ఉన్న వైద్య కళాశాల సముదాయంపై పడటంతో అందులోని ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి విమానంలో ఉండే ఫ్లైట్‌ డేటా రికార్డర్, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లను విశ్లేషిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
    Download Main Image

    Leave A Comment