పిల్లల అక్షరాభ్యాసానికి, విద్యాభివృద్ధికి పనచ్చిక్కాడు సరస్వతి అమ్మవారి కృప ఎంతో అవసరం. ఈ పుణ్యక్షేత్రం కేరళ రాష్ట్రంలో కొట్టాయం నుండి సంగనాచ్చేరి వెళ్ళే దారిలో పదకొండు కిలోమీటర్ల దూరంలో సింగవనం అనే ప్రదేశానికి దగ్గర్లోనే పనచ్చిక్కాడు ఉంది.
దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం కేరళలో పనచ్చిక్కాడు అనే చోట దామోదర నంబూద్రి అనే ఆయన ఉండే వారు. ఆయనకు పిల్లలు లేరు. ఆయన అక్కడున్న విష్ణువు ఆలయంలో తనకు పిల్లలు కావాలని కోరుతూ పూజలు చేస్తూ వచ్చారు. కాలం గడుస్తూ వచ్చింది. ఓ రోజు ఆయనకు ఓ కల వచ్చింది.
కొల్లూరు మూకాంబికా దేవాలయానికి వెళ్ళి వేడుకుంటే నీ కోరిక నెరవేరుతుంది అని ఆ కలలో ఓ అశరీరవాణి మాట వినిపించింది.
ఆ తర్వాత దామోదర నంబూద్రి ఏటా మూకాంబికా దేవి ఆలయానికి వెళ్ళివస్తూ తనకు సంతానం కలిగించవలసిందిగా ప్రార్థిస్తూ వచ్చారు. ఇలా ఆయన ఓసారి కొల్లూరు వెళ్ళి అంబిక సన్నిధిలో ప్రార్థించి పనచ్చిక్కాడుకి తిరిగొస్తుంటే అప్పుడు విష్ణువు ఆలయానికి దక్షిణ దిశలో ఉన్నఓ కోనేరు కనిపించింది. ఆ కోనేరు ఒడ్డున తన గొడుగునుంచి కోనేరులో దిగి స్నానం కానిచ్చుకున్నారు. ఆ తర్వాత ఒడ్డుకొచ్చి గొడుగు తీసుకుందామంటే ఆయన వల్ల కాలేదు. అదేంటి గొడుగు తీయలేకపోతున్నానని అనుకుని పలుసార్లు ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. అప్పుడు ఆయనకు ఓ ఆకాశవాణి మాటలు వినిపించాయి.
“దామోదరా, నువ్వు పిల్లల కోసం మొక్కుకుంటున్నావు....పిల్లలు లేరని బాధ పడకు. జగద్గురువు ఆదిశంకరరులవారు ఇక్కడి మూకాంబికను కొల్లూరుకు తీసుకుపోయి అక్కడ పూజించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె రూపమైన సరస్వతి నీ గొడుగులో ఉండి ఇక్కడకు నీతో వచ్చింది. నువ్వు ఇక్కడి అడవిలోకి వెళ్ళి చూడు. అక్కడ నీకు శిశువు రూపంలోఉన్న సరస్వతిదేవి విగ్రహం కనిపిస్తుంది. దానిని ఈ స్థలంలో ప్రతిష్టించి పూజించడం మొదలుపెట్టు“ అన్నవే ఆ మాటలు.
ఆ మాటలు విన్న నంబూద్రి అశరీరవాణి చెప్పిన దిశలోనే పయనించి అడవిలోకి వెళ్ళి చూశారు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. అశరీరవాణి చెప్పిన చోట శిశువు రూపంలో ఉన్న సరస్వతి అమ్మవారు విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చిన నంబూద్రి తాను కొనేరు ఒడ్డున పైకి తీయలేకపోయిన గొడుగున్న స్థలంలో ఆ సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎందరో భక్తులు ఆ అమ్మవారికి పూజలు చేస్తూ వస్తున్నారు.
నంబూద్రి పూజిస్తూ వచ్చిన సరస్వతి విగ్రహం చుట్టూ ఇప్పుడు తమలపాకు తీగలు విస్తరించి ఉన్నాయి. దీనికి అడుగు భాగంలో మూకాంబికా దేవి ఆలయంలో సరస్వతి ఉద్భవించిన గొడుగు ఉంది. దీనిని అందరూ దర్శించుకోవచ్చు. కానీ సరస్వతి శిశువు రూపంలో ఉన్న విగ్రహాన్ని చూడలేరు. “సరస్“ అంటే నీరు. “వతి“ అంటే దేవి అని అర్థం. దీనికి తగినట్లే ఈ ఆలయాన్ని ఓ సరస్సు ఆవరించి ఉందన్నది భక్తుల మాట.
ప్రస్తుతం బావిలాటి లోయలో ఉన్న దేవిని చూడడానికి కుదరదు కాబట్టి భక్తుల దర్శనం కోసం ఇక్కడ పశ్చిమ దిశను చూస్తున్నట్లుగా ఓ రాతిని నెలకొల్పి దాన్ని సరస్వతిగా అలంకరించి పూజిస్తున్నారు. ఈ ఆలయంలో ఉన్న సరస్వతి దేవి కొల్లూరు నుంచి దక్షిణం నుంచి వచ్చి ఆలయంలో వాసముండడంతో ఈ మూకాంబికను దక్షిణ మూకాంబిక అని వ్యవహరిస్తున్నారు.
ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
ఆ ఉత్సవాలప్పుడు సరస్వతి దేవిని శిశువురూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రి అప్పుడు చివరి రోజైన దశమినాడు భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి సరస్వతికి పూజలు చేస్తుంటారు. ఆ రోజున పెద్దలు తమ పిల్లలతో వచ్చి అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసిపోతారు. కొందరు తమ పిల్లలతో వచ్చి వారి పలకా పుస్తకాలను అమ్మవారి సన్నిధిలో ఉంచి ఆరాధిస్తారు. నృత్య, సంగీత కళారంగాలకు చెందిన ప్రముఖులెందరో ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజించి ఆశీస్సులు పొందడం ఎప్పుడూ కనిపించే దృశ్యమే.
పిల్లలు లేని దంపతులు ఇక్కడి ఆలయానికి వచ్చి సరస్వతి అమ్మవారిని దర్శించుకుని దేవికి మధ్యాన్నపు పూజలో నివేదించే పాలు, చక్కెర, పచ్చి బియ్యంకలిపి చేసిన పాయసాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే వారి కోరిక తీరి పిల్లలు పుడతారని ఆస్తికుల నమ్మకం.
- యామిజాల జగదీశ్
Leave A Comment