• Login / Register
  • Site Logo

    ఏపీ కరువు రహితంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం: మంత్రి నిమ్మల

    ఆంధ్ర ప్రదేశ్

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నీటిపారుదల శాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు చెప్పారు. శాసనసభలో జలవనరులపై లఘు చర్చను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈమేరకు ప్రసంగించారు. డెల్టా ప్రాంతాలను తలదన్నేలా రాయలసీమలో పంటలు పండుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబును అభినవ కృష్ణదేవరాయలుగా పేర్కొన్నారు. 

    ‘‘ప్రాధాన్య క్రమంలో తొలి ఏడాది ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపడుతున్నాం. వచ్చే ఏడాది ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ప్రాధాన్యంగా చేపడతాం. 20-30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేస్తున్నాం. కృష్ణా జలాలను ఆఖరి మైలు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. 2026 జులై నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడమే మా లక్ష్యం. పోలవరం ఎడమ కాలువ జలాలు ఈ ఏడాది అనకాపల్లి వరకు తీసుకెళ్లే యోచనలో ఉన్నాం.

    ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పేర్లు చెబితే తెదేపా గుర్తుకు వస్తుంది. వైకాపా పేరు చెబితే ఇసుక, గనులు, మద్యం, భూ మాఫియాలు గుర్తుకు వస్తాయి. వైకాపా పాలనలో ప్రాజెక్టుల నిర్వహణ సరిగా లేదు. ఈ నేపథ్యంలో తొలి ఏడాది నిర్వహణకు మూడు విడతల్లో రూ.800 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వ తప్పిదాలను ఒక్కొక్కటీ సరిచేస్తున్నాం. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా జలవనరులశాఖకు నిధులు కేటాయించాం’’ అని నిమ్మల రామానాయుడు తెలిపారు.


    Download Main Image

    Leave A Comment