ఇద్దరూ ఇద్దరే
--------------------
ఆంగ్ల నవలా రచయిత కోనన్ డోయల్ తన తొలినాళ్లలో రంగస్థల నాటకాలు రాసేవారు.
ఆ సమయంలో, వారానికి మూడు పౌండ్లు సంపాదిస్తున్న విశ్వవిఖ్యాత
హాస్యనటుడు చార్లీ చాప్లిన్ ఓమారు ఆయన వద్దకు వచ్చి, "సర్, ఇక నుండి మన నెలవారీ ఆదాయాన్ని సగానికి పంచుకుందాం. ఈ మేరకు మనం ఒక ఒప్పందం చేసుకుందాం. ఏమంటారు?" అని అడిగారు.
అందుకు కోనన్ డోయల్ నిరాకరించారు.
రోజులు గడిచాయి. చార్లీ చాప్లిన్ లక్షాధికారి అయినప్పుడు, "ఆ రోజు నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది" అని అన్నారు కోనన్.
"ఆ రోజు చాప్లిన్ మాటలు విని, దానికి అనుగుణంగా ప్రవర్తించి ఉంటే, నేను కూడా ఉన్నత స్థాయికి చేరుకునేవాడిని కదా" అని అనుకున్నారు. తాను చాప్లిన్ చేసిన సూచనను స్వీకరించక పెద్ద తప్పు చేశా ననుకున్నారు. కానీ ఇప్పుడనుకుని ఏం లాభం అని తనకు తాను సర్ది చెప్పుకున్నారు. చాలా నష్టపోయాననుకున్నారు. ఇద్దరం కలిసి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది కదా అనుకున్నారు.
గాలి వీచినా, తుపాను వచ్చినా గడ్డిపరక కదలాడుతుందే తప్ప వాలిపోదు. కానీ భారీ వృక్షమైన మర్రిచెట్టు బలమైన గాలికి కూలిపోతుంది.
మనం ఇతరుల సలహాలను విని మంచేమిటో చెడేమిటో ఆలోచించి ఓ నిర్ణయానికి వేస్తే పరిస్థితి మారొచ్చు. మెరుగుపడొచ్చు.
మన అవసరం ఉన్నప్పుడు, వారు మన ఇంటికి వెతుక్కుంటూ వచ్చి మనల్ని సందర్శిస్తారు. అయితే వారి అవసరం తీరినప్పుడు, మనం వారిని చూడటానికి వెళ్తే పెద్దగా పట్టించుకోరు. వారి ప్రవర్తన వేరేగా ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. సంస్కారమూ కాదు. కానీ ఈరోజుల్లో చాలా మంది వాలకం ఇలానే ఉంటోంది. నిజానికి మంచివాళ్ళు అలా ఉండరు. తప్పక సహాయపడతారు. ప్రతిఫలం ఆశించారు.
ఇంతకూ చార్లీ చాప్లిన్, కోనన్ డోయల్
గురించి ఒకటి రెండు మాటలు చూద్దాం. ఇద్దరూ ప్రతిష్ఠాత్మకమైన "సర్" బిరుదాంకితులే.
సర్ చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ జూనియర్ (16 ఏప్రిల్ 1889 - 25 డిసెంబర్ 1977) ఒక ఆంగ్ల హాస్య నటుడు. చిత్రనిర్మాత. స్వరకర్త. మూకీ చలనచిత్ర యుగంలో పతాకస్థాయికి చేరారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు. ఆయన కెరీర్ 75 సంవత్సరాలకు పైగా విస్తరించింది. విక్టోరియన్ శకంలో ఆయన బాల్యం నుండి 1977లో మరణానికి ఒక సంవత్సరం ముందు వరకు ప్రశంసలు పొందారు. అలాగే విమర్శలూ చవిచూశారు.
ఇక సర్ ఆర్థర్ ఇగ్నేషియస్ కోనన్ డోయల్ (22 మే 1859 - 7 జూలై 1930) విషయానికొస్తే ఈయన బ్రిటిష్ రచయిత. వైద్యుడు. ఆయన 1887లో ఎ స్టడీ ఇన్ స్కార్లెట్ కోసం షెర్లాక్ హోమ్స్ పాత్రను సృష్టించారు. షెర్లాక్ హోమ్స్ కథలు అసాధారణం.
- యామిజాల జగదీశ్
Leave A Comment