• Login / Register
  • Site Logo

    కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా

    వినోదం
    కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా

    భాషా వివాద నేపథ్యం..

    మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు రాజ్యసభ స్థానానికి వేయాల్సిన నామినేషన్‌ను వాయిదా వేసుకున్నారు.
      ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ఈవెంట్‌లో కన్నడ భాషపై ఎంఎన్ఎం అధినేత, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌   చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ భాషా వివాదం నేపథ్యంలో ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్  దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  త్వరలో విడుదల కాబోయే తన చిత్రం ‘థగ్ లైఫ్’ వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్‌ వేయాలని భావిస్తున్నట్లు తెలిపాయి.

    కమల్‌  2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించారు. విపక్ష ఇండియా కూటమిలో ఇది భాగం. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్‌ఎం ప్రచారం చేసింది. 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఎంఎన్‌ఎంకు ఎగువసభ స్థానం కేటాయించారు. దీంతో కమల్‌ హాసన్‌ రాజ్యసభకు వెళ్లనున్నారనే విషయాన్ని డీఎంకే-ఎంఎన్‌ఎం ఇటీవల ఖరారు చేశాయి.
    ఇటీవల నిర్వహించిన ‘థగ్‌లైఫ్‌’ సినిమా ఈవెంట్‌లో తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్‌ వ్యాఖ్యానించడంతో భాషా వివాదం మొదలయ్యింది. కమల్ వ్యాఖ్యలను కన్నడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కర్ణాటకలో థగ్‌లైఫ్‌ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (కేఎఫ్‌సీసీ) హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను మంగళవారం విచారించిన న్యాయస్థానం కమల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది. దీంతో ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్‌హాసన్‌ నిర్ణయించారు. అనంతరం, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ ‘కేఎఫ్‌సీసీ’కి కమల్‌ లేఖ రాశారు. అయితే, అందులోనూ సారీ చెప్పకపోవడం గమనార్హం.
    Download Main Image

    Leave A Comment